వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న బాలుడిని హత్య చేశారని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు కలిసి దంపతులను కొట్టి చంపేశారు. పోలీసుల కథనం మేరకు, నడియా జిల్లాలోని నిశ్చింతపుర్‌లో స్వర్ణభ మండల్ అనే బాలుడు శుక్రవారం మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. దాంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి, రాత్రంతా వెతికారు.
ఈ క్రమంలో శనివారం స్థానికంగా ఉంటున్న ఉత్పల్ బిశ్వాస్, సోమ బిశ్వాస్ దంపతుల ఇంటి పక్కనున్న కుంటలో పట్టాలో చుట్టి ఉన్న బాలుడి మృతదేహం లభ్యమైంది. తమతో ఉన్న గొడవల కారణంగా ఉత్పల్ బిశ్వాస్, సోమ బిశ్వాస్ దంపతులే బాలుడిని హత్య చేశారని ఆరోపిస్తూ బాలుడి కుటుంబసభ్యులు, మరికొందరు కలిసి ఆ దంపతులను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు.
అంతటితో ఆగకుండా వారి ఇంటిని ధ్వంసం చేసి, వారికి సంబంధించిన జూట్ గోదాంకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.