సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తనను దూషిస్తూ ఇన్‌స్టా, వాట్సాప్ ఖాతాల్లో పోస్టులు పెడుతున్నాడన్న అక్కసుతో కొందరు యువకులు ఆ యువకుడుని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ ఘోరం తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లిలో జరిగింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... భూపాలపల్లి రాజీవ్ నగర్ వాసి ఎండీ బాసిత్ (20)కు, శాంతినగర్‌కు చెందిన రడపాక భాస్కర్, బుస్స ప్రశాంత్, గాజుల కుషాల్ మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. రెండు నెలల క్రితం బాసిత్‌పై వీరు దాడి చేశారు. దీంతో వారిపై పగ పెంచుకున్న బాసిత్ సోషల్ మీడియాలో వారిని కించపరిచేలా పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. ఇది సహించలేకపోయిన ఆ ముగ్గురూ మరో ముగ్గురు స్నేహితులు పందిళ్ల శ్రవణ్, బరిగల ప్రణయ్, చొప్పరి నవీన్ సహాయంతో బాసిత్ను అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశారు.
ఈ నెల 4న బాసిత్ తన స్నేహితుడు అరుణ్ కలిసి బైకుపై వెళ్తుండగా నిందితులు అడ్డగించి దాడి చేశారు. అనంతరం బాసిత్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అతని చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
బాసిత్‌తో పాటు ఉన్న స్నేహితుడు అరుణ్ ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండు తరలించినట్టు డీఎస్పీ సంపత్ రావు తెలిపారు. కాగా, మృతుడు బాసిత్‌పై కూడా గతంలో గంజాయి, చైన్ స్నాచింగ్ కేసులు నమోదైవున్నాయని పోలీసులు వెల్లడించారు.