ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. నగల వ్యాపారి ఒకరు తన భార్యాపిల్లను చంపేసి, ఆ తర్వాత మృతదేహాలను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. పిమ్మట తాను కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించగా, సీఆర్‌పీఎఫ్ పోలీసులు రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
యూపీకి చెందిన ముకేశ్ వర్మ అనే నగల వ్యాపారికి భార్య రేఖ, కుమార్తెలు భవ్య, కావ్య, కుమారుడు అభిష్త్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నాగంతస్తుల భవనంలో సోదరులతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యను కత్తితో పొడిచి చంపిన ముకేశ్ వర్మ.. కుమారుడు, కుమార్తెలకు విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత వారి ఫోటోను తీసి తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఆ తర్వాత మధుర ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, రైల్వే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముకేశ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఇదిలావుంటే, మకేశ్ వాట్సాప్ చూసిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు ఇంటికి వెళ్లి చూడగా, నాలుగు మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాలే ఈ దారుణానికి కారణంగా చెపుతున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.