Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకు.. పిడిగుద్దులు కురిపించిన తండ్రి.. అనంతలోకాలకు...

Advertiesment
deadbody

ఠాగూర్

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (14:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ దారుణ ఘటన జరిగింది. పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చిన కుమారుడుపై మద్యం మత్తులో ఉన్న కన్నతండ్రి పిడిగుద్దులు కురిపించాడు. విచక్షణ కోల్పోయి విపరీతంగా దాడి చేయడంతో ఈ దారుణం శనివారం రాత్రి చోటుచేసుకోగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చౌటుప్పల్ మండలం ఆరేగూడేనికి చెందిన కట్ట సైదులు అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో కుమారుడు భానుప్రసాద్ (14) ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. పిల్లల చదువు నిమిత్తం కుటుంబమంతా చౌటుప్పల్లో నివాసముంటోంది. భానుప్రసాద్ చదివే పాఠశాలలో శనివారం వీడ్కోలు వేడుక నిర్వహించారు. దీంతో అతను రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. అప్పటికే సైదులు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. 
 
అసలు విషయం తెలుసుకోకుండానే ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ కుమారుడిని విచక్షణారహితంగా కొట్టాడు. ఛాతీ, ఇతర భాగాలపై పిడిగుద్దులు గుద్దడం, కాలితో తన్నడంతో భానుప్రసాద్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోగా, హుటాహుటిన చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం వద్దని వైద్యులకు చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అర్థరాత్రి ఆరెగూడెంకు తరలించారు. 
 
పోలీసులకు తెలిస్తే సైదులుపై కేసు నమోదవుతుందని, జైలుకు పోతాడని బంధువులు, స్థానికులు భావించారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లుచేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్మశానవాటికకు తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో చితికి నిప్పంటించే ముందు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విషయం చెప్పండి .. ఓవర్ యాక్షన్ చెయొద్దు : హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Video)