ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు మండలంలోని సుద్దపల్లిలో శనివారం ఈ ఘటన కలకలం రేపింది. ప్రియుడి కుటుంబంపై పెట్రోల్ పోసే క్రమంలో మంటల్లో చిక్కుకున్న మహిళ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ప్రియుడిపై కోపంతో అతని కుటుంబ సభ్యులపై ఓ మహిళ పెట్రోలు పోసి నిప్పంటించి, చివరకు తాను మృత్యువాతపడింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. సుద్దపల్లికి చెందిన మల్లేష్‌కు తెనాలికి చెందిన దుర్గ అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అప్పటికే దుర్గకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనిపై శనివారం తెనాలిలో పంచాయితీ పెట్టారు. దీంతో కోపం పెంచుకున్న దుర్గ సుద్దపల్లికి చేరుకుని.. మల్లేష్ భార్యతో వాగ్వాదానికి దిగారు.
ఆమెపై, కుమారుడిపై, మల్లేష్ తల్లిపై పెట్రోల్ పోసి.. తెనాలిలో ఉన్న మల్లేష్‌కు ఫోన్ చేసి బెదిరిస్తూ నిప్పంటించారు. ఈ క్రమంలో దుర్గ శరీరంపైనా పెట్రోలు పడడంతో ఆమెకూ నిప్పంటుకుంది. మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఆరుగురు స్థానికులకూ గాయాలయ్యాయి. బాధితులందరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ దుర్గ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.