ముంబై మహానగరంలో దారుణం జరిగింది. సభ్యసమాజం తలదించుకునే దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి సమక్షంలోనే చిన్నారిపై అత్యాచారం జరిగింది. ప్రియుడి చేతిలో రెండున్నరేళ్ళ పసిపాప అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైంది. మల్వాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మల్వాణీకి చెందిన 30 యేళ్ల మహిళకు 19 యేళ్ల యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. మహిళకు రెండున్నరేళ్ల బాలిక కూడా ఉంది. ఈ క్రమంలో ఆ మహిళ సమక్షంలోనే ఆ కామాంధుడు రెండున్నరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గొంతు నులిమి చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే, చిన్నారికి మూర్ఛ రావడంతో కింద పడిపోయినట్టుగా నమ్మించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే మృతి చెందడంతో వైద్యులు అనుమానించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేరు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆమెపై లైంగికదాడి జరిగిందని, ఊపిరాడకపోవడం వల్ల కలిగిన షాక్‌తో పాప మరణించిందని ధృవీకరించారు. ఈ ఘటనలో తల్లి, ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించగా పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారిద్దరిపై పోక్సో చట్టం, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.