పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉందని, మనం భీకర దాడులకు తెగబడితే పాకిస్థాన్ పాలకులు, ప్రజలు కలుగులో దాక్కోవాల్సిందేనంటూ భారత ఆర్మీ ఎయిర్‌ఢిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్హా అన్నారు. భారత్ తలచుకుంటే పాకిస్థాన్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం మనకు ఉందన్నారు. అదే జరిగితే దాయాది దేశం ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ మొత్తం తమ నిఘా పరిధిలోనే ఉందన్నారు. ఒకవేళ పాకిస్థాన్ తమ సైనిక ప్రధాన కార్యాలయాన్ని రావల్పిండి నుంచి ఖైబర్ పునాఖ్వా (కేపీకే) లాంటి ప్రాంతాలకు తరలించినా, వారు "దాక్కోవడానికి చాలా లోతైన గొయ్యి తవ్వుకోవాల్సిందే" అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత బలగాలు 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌లోని కీలక వైమానిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశాయని లెఫ్టినెంట్ జనరల్ డీ'కున్హా, గుర్తుచేశారు. ముఖ్యంగా విలువైన టార్గెట్లను నాశనం చేసేందుకు 'లోయిటరింగ్ మ్యూనిషన్స్' (లక్ష్యంపై కొంతసేపు గాల్లోనే ఉండి, తర్వాత దాడి చేసే ఆయుధాలు) వాడినట్లు తెలిపారు.
"పాకిస్థాన్ దాని పొడవు, వెడల్పులలో ఎక్కడైనా, ఎంత లోతుకైనా ఎదుర్కొనేందుకు సరిపడా ఆయుధాలు భారత్ దగ్గర ఉన్నాయి. మా సరిహద్దుల నుంచి కానీ, దేశంలోపల నుంచి కానీ మొత్తం పాకిస్థానన్‌ను టార్గెట్ చేయగల సత్తా మాకుంది. జీహెచ్‌యూను రావల్పిండి నుంచి కేపీకేకు లేదా ఇంకెక్కడికైనా మార్చుకోవచ్చు, అవన్నీ మా దాడుల పరిధిలోనే ఉంటాయి. కాబట్టి వారు నిజంగా చాలా లోతైన చోటు చూసుకోవాలి" అని డీ'కున్హా వివరించారు.