తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. కూలీ పని ఇప్పిస్తామని ఓ మహిళను నమ్మించి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసి ఓ స్తంభానికి కట్టేసి పరారయ్యారు. రాత్రంతా ఆమె అలాగే తీవ్ర రక్తస్రావంతో స్తంభానికి కట్టబడి స్పృహ కోల్పోయింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ పరిధిలో వున్న తండాకు చెందిన ఓ మహిళ కూలీ పని కోసం మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది. ఆమెపై కన్నేసిన కొందరు దుండగులు కూలీ పని ఇప్పిస్తామంటూ ఆమెను నమ్మించి కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారులోని ఏడుపాయల రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా దాడి చేసారు. వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి అక్కడ నుంచి పరారయ్యారు. రాత్రంతా బాధితురాలు తీవ్రగాయాలతో బాధపడి స్పృహ కోల్పోయింది. అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.