హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకుగురైంది. ఆమె ఇంట్లో పని చేసే వారే ఈ దారుణానికి పాల్పడ్డారు. మృతురాలిని రేణు అగర్వాల్ (50)గా గుర్తించారు. ఇంట్లోని బంగారంపై కన్నేసిన పనివాళ్లే ఇంటి యజమానురాలిని చిత్రహింసలకు గురిచేసి, కుక్కర్‌తో కొట్టి, గొంతుకోసి హత్య చేశారు. ఆ మహిళ బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆమె ఇంట్లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న హర్ష, అదే భవనంలోని బంధువుల ఇంట్లో పనిచేస్తున్న రోషన్ అదే ఇద్దరు యువకులు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ముందుగా ఆమెను కాళ్లు, చేతులు కట్టేసి, లాకర్ తాళాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని చిత్ర హింసలకు గురిచేశారు. ఆమె ఎంతకీ చెప్పకపోవడంతో ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టి చివరకు గొంతుకోసి ప్రాణం తీశారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇంటి యజమాని స్టీల్ ప్లాంట్ వ్యాపారి కావడంతో ఇంట్లో బంగారం, నగదు భారీగా ఉంటుందని భావించి దోపిడీకి కుట్ర పన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ఒకే ప్రాంతానికి చెందిన నిందితులిద్దరూ స్నేహితులు కావడం గమనార్హం. బాధితురాలు అనారోగ్యంతో ఉండటంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు కేవలం 11 రోజుల క్రితమే హర్షను పనిలో పెట్టుకున్నారు. 
 
									
										
								
																	
	 
	రేణును హత్య చేసిన తర్వాత ఒంటిపై ఉన్న బంగారు గొలుసుతో పాటు కొంత నగదు కూడా తీసుకుని నిందితులు పరారయ్యారు. యజమాని స్కూటీపైనే హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ వాహనాన్ని వదిలేసి రైలులో తప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు కోల్‌కతాకు చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పనిలో చేరినట్టు తెలుసుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.