Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యాపిల్లకు సైనెడ్ ఇచ్చి.. తానుకూడా.. ప్రశాంతంగా చనిపోనివ్వండి..

Advertiesment
couple
, ఆదివారం, 26 మార్చి 2023 (09:20 IST)
ఆ దంపతులకు వారి పిల్లలే ప్రాణం. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే, తమ ఇద్దరు కుమారులు అనారోగ్యం బారినపడటాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. వైద్యం అందించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. బిడ్డలకు విషమిచ్చి.. తామూ తీసుకున్నారు. హైదరాబాద్‌ కుషాయిగూడలోని కందిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.
 
పోలీసుల కథనం మేరకు.. నిజామాబాద్‌కు చెందిన గాదె సతీశ్‌ (39)కు, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్‌ మండలానికి చెందిన వేద(35)తో 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు నిషికేత్‌(9), నిహాల్‌(5) ఉన్నారు. నిషికేత్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు లేవు. నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సతీశ్‌.. రెండేళ్లుగా కుటుంబంతో కందిగూడలో నివాసముంటున్నారు. 
 
అయితే, నిహాల్‌ పుట్టుకతోనే ఆటిజంతో బాధపడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం నిషికేత్‌ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులకు చూపించగా.. మెనింజైటిస్‌ ఉన్నట్లు చెప్పారు. నిషికేత్‌కు చెవుల నుంచి తరచూ చీము రావడంతో పాటు వినికిడి లోపం ఏర్పడింది. అప్పటినుంచి దంపతులిద్దరూ పిల్లల ఆరోగ్యం గురించి బాధపడేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
 
శనివారం పిల్లలకు, భార్యకు సతీశ్‌ సైనైడ్‌ ఇచ్చాడని.. ముగ్గురూ చనిపోయారని ధ్రువీకరించుకున్నాక తానూ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత సతీశ్‌, వేదలకు తెలిసిన వ్యక్తులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయలేదు. అనుమానంతో ఇంటికొచ్చి చూడగా.. ఇద్దరు పిల్లలు, వేద పడక గదిలోని మంచంపై విగతజీవులుగా పడిఉన్నారు. సతీశ్‌ పక్క గదిలో కుప్పకూలిపోయి కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాల్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
 
ఆత్మహత్య చేసుకున్న గదిలో లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 'మా నలుగుర్ని కాపాడాలని ప్రయత్నించొద్దు. ప్రశాంతంగా చనిపోనివ్వండి' అని అందులో రాసినట్లు తెలిసింది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, పిల్లల అనారోగ్యంపైనే మనస్తాపానికి గురయ్యేవారని వేద తండ్రి శ్రీశైలం కంటతడి పెట్టారు. వారికి సైనైడ్‌ ఎలా లభించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు 36 ఉపగ్రహాలను మోసుకెళ్లే భారీ రాకెట్ ఎల్‌వీఎం-3 రాకెట్ ప్రయోగం