ఇటీవలి కాలంలో కొత్తగా పెళ్లయిన జంటల మధ్య దాంపత్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా బైటకొస్తున్నాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్, రెండు చేతులా ఆర్జిస్తున్నాడని వివాహం చేస్తే... తీరా అతడికి ఆ శక్తి లేక నీలుగుతున్నాడంటూ ఎంతోమంది ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరైతే కాళ్లకు బలపాలు కట్టుకుని సంతానం కోసం ఫెర్టిలిటీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో తేలుతుందేమిటయ్యా అంటే... ఇటీవలి జంటలు పొద్దస్తమానం పనిపైనే ధ్యాసతోనో, గ్యాప్ దొరికితే మొబైల్ ఫోన్లతోనో, ఇంకా గ్యాప్ దొరికితే టీవీల్లో వచ్చే గేమ్ షోల తోనో తమ వ్యక్తిగత జీవితాలను అధోగతి పాల్జేస్తున్నారు. దానితో జంటల మధ్య గ్యాప్ ఏర్పడి అవి కాస్తా వివాదాలకు దారి తీస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నాటక లోని బెంగళూరులో ప్రవీణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గత మే నెలలో చందన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సప్తగిరి ప్యాలెస్ దగ్గరలో కాపురం కూడా పెట్టారు. ఐతే ఫస్ట్ నైట్ రోజు నాడే భర్త తనపై చేయి కూడా వేయలేదని, కనీసం ఆ తర్వాత అయినా తనతో శారీరకంగా కలుస్తాడేమో చూద్దామనుకుంటే గత 3 నెలలుగా అతడు అలా దగ్గరకు కూడా రాకుండా కాలం గడిపేసాడట. దీనితో వైద్యుడికి చూపించుకోవాలని చందన అతడికి సూచన చేసిందట. మెడికల్ టెస్టుల్లో అతడు చాలా ఫిట్ అని తేలిందట.
మరి భార్యతో శారీరకంగా ఎందుకు దగ్గరవ్వలేదని అడిగితే... మెంటల్ స్ట్రెస్ వల్ల అలా వున్నాడని వైద్యులు చెప్పారట. కొన్నాళ్లు అలా వదిలేస్తే మెల్లిగా దారిలోకి వస్తాడని అన్నారట. ఐతే భార్య చందన మాత్రం ఈ మాటలను పట్టించుకోలేదు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకుని వెళ్లింది. దాంతో విషయం కాస్తా పెద్దదైంది. భర్త ప్రవీణ్ భార్య చందనపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తన భార్య తన నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తుందంటూ ఆరోపించాడు. భార్య చందన సైతం భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.