తను ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని నమ్మించాడు. తనకు నెలకి 80 వేల జీతం వస్తుందని, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ నమ్మించాడు. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన అతడు చెప్పినవన్నీ నిజమేననుకున్న అమ్మాయి తరపు వారు లక్షల్లో కట్నం, బంగారం ముట్టజెప్పి ఘనంగా పెళ్లి చేసారు. విజయవాడలో నివాసం వుంటున్న అతడు పెళ్లయిన రెండుమూడు నెలలు అనుమానం రాకుండా నటించాడు. వాస్తవానికి అతడికి ఉద్యోగం లేదు, నిత్యం ఫోనుల్లో మాట్లాడుతూ కనిపిస్తుండేవాడు. ఆ ఫోన్లలో ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నాడో తెలుసుకుని షాక్ అయ్యింది. తన భర్త ఇంజినీర్ కాదనీ, అతడో అమ్మాయిల బ్రోకర్ అని తెలుసుకుని కన్నీటిపర్యంతమైంది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నెల్లూరు మెక్లెన్స్ రోడ్డుకి చెందిన ఓ యువతికి ఆమె పెద్దలు మ్యాట్రిమోని ద్వారా వివాహ సంబంధాలు చూస్తుండగా విజయవాడకి చెందిన అమీర్ ఖాన్ ప్రొఫైల్ కనిపించింది. ఫోన్ నెంబరు పట్టుకుని అతడిని విచారించగా.. అతడికి రూ. 80 వేల జీతమనీ, ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నట్లు నమ్మించారు. పెద్దల అంగీకారంలో 2023 ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసారు. పెళ్లిలో రూ 15 లక్షలు నగదు, 13 సవర్ల బంగారం పెట్టారు. ఐతే పెళ్లైన 2 నెలలకే అతడు భార్యను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించాడు.
చిన్నచిన్న విషయాలకే గొడవ పెట్టుకునేవాడు. గదిలో వంటరిగా వుంటూ భార్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. భర్త బాత్రూంకి వెళ్లిన సమయంలో గదిని శుభ్రం చేస్తుండగా ఆమెకి పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు కనిపించాయి. వాటిలో ఒకదాన్ని తీసుకుని ఫోన్ చేయగా అవతలి వాయిస్ అమ్మాయి వివరాలు, వయసు అంటూ ఏవేవో చెప్పుకొచ్చారు. దీనితో తన భర్త ఓ అమ్మాయిల బ్రోకర్ అని తెలుసుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్నున్నారు.