ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ప్రేమించిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు. అంతటితో కసితీరక మృతదేహాన్ని ఏడు ముక్కలు చేశాడు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే.. తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడమే ఆమె చేసిన నేరం. దీంతో ఆ గ్రామ మాజీ సర్పంచ్ ప్రియురాలిని హత్య చేసి చంపేశాడు. ఝాన్సీ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
ఈ నెల 13వ తేదీన కిషోర్ పురా గ్రామంలోని ఓ రైతు తన పొలానికి వెళ్లినప్పుడు బావి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం గమనించాడు. అనుమానంతో చూడగా, నీటిపై రెండు సంచులు తేలియాడుతూ కనిపించాయి. దీంతో ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని బావిలోని రెండు సంచులను వెలికి తీసి విప్పి చూడగా, అందులో శరీర భాగాలు ఉండటం చూసి పోలీసులతో పాటు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పైగా, ఈ కేసులోని నిందితులను గుర్తించేందుకు వీలుగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, 100 మందికి పైగా గ్రామస్థులను విచారించారు. మృతురాలిని గుర్తించేందుకు వేలాది పోస్టర్లు అంటించగా, వాటిలో ఒక పోస్టర్ చూసిన ఒక వ్యక్తి ఆమెను తన సోదరి రచన యాదవ్‌గా గుర్తించాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తికమ్‌గఢ్‌కు చెందిన రచన ఒక వితంతువు అని, ఆమెకు సంజయ్ పటేల్ కొంతకాలంగా సంబంధం ఉందని తేలింది. దీంతో సంజయ్ పటేల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. రచన నిరంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయి, ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆగస్టు 8న రచనను గొంతు నులిమి హత్య చేసి, సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. అనంతరం వాటిని సంచుల్లో వేసి బావిలోను, సమీపంలోని వంతెన వద్ద పడేశారు.
'ఈ కేసు దర్యాప్తు కోసం 8 బృందాలను ఏర్పాటు చేశాం. గురువారం లఖేరి నది నుంచి మహిళ తలను స్వాధీనం చేసుకున్నాం' అని ఎస్ఎస్పీ మీడియాకు తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన దర్యాప్తు బృందానికి రూ.50,000 రివార్డు ప్రకటించారు. పరారీలో ఉన్న నిందితుడు ప్రదీప్ అహిర్వార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.25,000 రివార్డును కూడా ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు.