స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో కేసు విచారణలో భాగంగా ఢిల్లీ కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తామిద్దరం స్నేహితులమని పేర్కొంటూ నిందితుడు ముందస్తు బెయిల్ కోరిన నేపథ్యంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మైనర్ అయిన బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు... కొన్నేళ్లుగా నిందితుడితో ఆమెకు పరిచయం ఉంది. ఆమెను తన స్నేహితుడి ఇంట్లో బంధించి లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, తామిద్దరం ఇష్టపూర్వకంగా శారీరక బంధాన్ని కొనసాగించామని, ఎఫ్ఐఆర్ నమోదులోనే తప్పులు దొర్లాయని ఆరోపిస్తూ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోరాడు.
దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. పైగా, బాధితురాలు, నిందితుడు స్నేహితులే అయినప్పటికీ బాధితురాలిపై పదేపదే అత్యాచారం చేయడానికి, స్నేహితుడు ఇంట్లో బంధించేందుకు కనికరం లేకుండా కొట్టేందుకు స్నేహం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదు అని కోర్టు వ్యాఖ్యానించింది. భయం, తన మనసుకు తగిలిన గాయం కారణంగా ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి బాధితురాలు సంకోచించడం సహజమే అని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు. పైగా, కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.