కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి నలుగురు సభ్యులు విగతజీవులుగా కనిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ప్రాణాలు కోల్పోయినట్టు భావిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే,
మైసూర్‌లోని విశ్వేశ్వరయ్య నగర్‌లోని సంకల్ప్ సెరీన్ అపార్టుమెంటులో చేతన్ (45) అనే వ్యాపారి తన భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (65) అప్పుల వారి బాధ భరించలేక బలవంతంగా తనువు చాలించారు. భార్య, కుమారుడు, తల్లికి విషం ఇచ్చి చంపిన తర్వాత చేతన్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, చేతన్ ఆత్మహత్య చేసుకునేందుకు ముందు అమెరికాలో ఉన్న తన సోదరుడుకి ఫోన్ చేసి, తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి, ఫోన్ కట్ చేశాడని పోలీసులు తెలిపారు. దాంతో అతని సోదరుడు పలుమార్లు తిరిగి కాల్ చేశాడు. కానీ, ఎలాంటి స్పందన రాలేదు. దీంతో స్థానికంగా ఉండే తమ బంధువులకు సామాచారం చేరవేయగా, వారు అపార్టుమెంటుకు వెళ్ళి చూడా నలుగురు విగతజీవులుగా పడివున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
అయితే, చేతన్ కుటుంబం గత పదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నారని, వారు ఎపుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టుగా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.