హైదరాబాదులోని మధురానగర్ లో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతికి ఉద్యోగం ఆశ చూపి పిలిపించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు సంస్థ మేనేజర్. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
మధురానగర్ లోని టెక్ ఫ్లో అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం ఓ యువతి దరఖాస్తు చేసుకున్నది. ఆమెకి ఇంటర్వ్యూ కాల్ రావడంతో కంపెనీకి వెళ్లింది. అక్కడ సంస్థ మేనేజర్ మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. దానితో సదరు యువతి ఆనందంలో మునిగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి... ఉద్యోగంలో భాగంగా మీరు కొత్త సిమ్ కార్డును మీ ఫోనులో వేసుకోవాల్సి వుంటుంది అని చెప్పాడు. ఆమె సరేనని చెప్పి వెళ్లిపోయింది.
మళ్లీ మేనేజర్ కాల్ చేసి మీకు సిమ్ కార్డ్ ఆఫీసులో ఇవ్వడం కుదర్లేదు, రేపు మీరు జాయి కావాలి కదా... అందుకే మా ఇంటికి వచ్చి సిమ్ కార్డ్ కలెక్ట్ చేసుకోమని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన యువతి అక్కడికెళ్లింది. యువతి లోపలికి రాగానే గడియపెట్టి ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చంపేస్తానంటూ భయపెట్టాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి మధురానగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతులు ఇలా ఉద్యోగాల ఆఫర్లంటూ వెళ్లేటపుడు చాలా అప్రమత్తంగా వుండాలని పోలీసులు చెబుతున్నారు.