ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ప్రధానంగా నాలుగు జట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఈ జట్లే సెమీస్‌కు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల తీరు తెన్నులను పరిశీలిస్తే, ముఖ్యంగా, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచ్‌లను పట్టే విషయాన్ని పరిశీలిస్తే, పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిస్తే, భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. ఈ వివరాలను ఓసారి పరిశీలిద్ధాం.
క్యాచ్‌లను వదిలివేయడంలో పాకిస్థాన్ ఆటగాళ్లను మించిన ఆటగాళ్లు మరొకరు లేరని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ జట్టు ఆటగాళ్ళు ఇప్పటివరకు మొత్తం 14 క్యాచ్‌లను వదిలివేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జో రూట్ 9 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చాడు. దీన్ని పాకిస్థాన్ ఆటగాళ్లు జారవిడిచారు. ఫలితంగా జో రూట్ అలాంటి అవకాశం మరోమారు ఇవ్వకుండా ఏకంగా (107) సెంచరీ కొట్టాడు.
కానీ, భారత్ మాత్రం ఇప్పటివరకు మొత్తం తాను ఆడిన మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క క్యాచ్‌ను జారవడిచి అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్ ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ (12), న్యూజిలాండ్ (9), సౌతాఫ్రికా (8), వెస్టిండీస్ (6), ఆస్ట్రేలియా (4), బంగ్లాదేశ్ (4), శ్రీలంక (3), ఆప్ఘనిస్థాన్ (2), భారత్ (1)లు ఉన్నాయి.