ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా సోమవారం మరో ఆసక్తికర మ్యాచ్ ఫలితం వెల్లడైంది. వెస్టిండీస్ జట్టును బంగ్లాదేశ్ చిత్తు చేసింది. కరేబియన్ ఆటగాళ్లు నిర్ధేశించిన 322 పరుగుల భారీ విజయలక్ష్యాన్నికవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 41.3 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ఈ వరల్డ్ కప్‌లో మరో సంచలన విజయం నమోదైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో కరేబియన్ జట్టు తరపున ఓపెనర్ ఎవిన్ లూయిస్ 67 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చాడు. వికెట్ కీపర్ షై హోప్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హోప్ 96 పరుగులు చేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు.
అలాగే, నికొలాస్ పూరన్ (25), హెట్మెయర్ (50), కెప్టెన్ హోల్డర్ (33), డారెన్ బ్రావో (19) అందరూ కలిసికట్టుగా కదం తొక్కారు. హెట్మెయర్ కేవలం 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ హోల్డర్ 15 బంతులాడగా, వాటిలో 4 ఫోర్లు, 2 సిక్స్‌లున్నాయి. చివర్లో డారెన్ బ్రావో రెండు భారీ సిక్స్‌లతో అలరించాడు.
ఇలా.. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను కరేబియన్ ఆటగాళ్లు చీల్చిచెండారారు. ఫలితంగా విండీస్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్, సైఫుద్దీన్‌లకు చెరో 3 వికెట్లు లభించాయి. సీనియర్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఆ తర్వాత 322 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షకీబ్ అల్ హసన్ 124, తమీమ్ ఇక్బాల్ 48, లిటన్ దాస్ 94 పరుగులు చేశారు.