Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : పాకిస్థాన్ విజయంతో మారిపోయిన సెమీస్ సమీకరణాలు...

pakistan team
, ఆదివారం, 5 నవంబరు 2023 (12:14 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ మెగా టోర్నీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లోభాగంగా, శనివారం పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మ్యాచ్ ఫలితం షరామామూలుగా వెలువడింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేసించిన విజయలక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ జట్టు ఓటమిపాలైంది. 
 
కానీ, పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపైనే ఇపుడు చర్చ సాగుతుంది. 401 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కివీస్ జట్టు ఓటమిపాలైంది. దీనికి కారణం పాకిస్థాన్ ఆటగాళ్లు రాణించడం కాదు. వరుణ దేవుడు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారు. ఫలితంగా 401 పరుగులు చేసినప్పటికీ ఓడిపోయిన తొలి జట్టుగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో కివీస్ నిలిచింది. 
 
ఇదిలావుంటే వరుణ దేవుడు కారణంగా పాకస్థాన్‌కు గెలుపు దక్కింది. దీంతో సెమీస్ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయాయి. ఈ గెలుపుతో పాకిస్థాన్ ఖాతాలో 8 పాయింట్లు చేరాయి. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ సరిసమానంగా నిలిచింది. ఇరు జట్లకు సమానమైన పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్ రేటు తక్కువగా ఉండడంతో పాకిస్థాన్ 5వ స్థానానికి పరిమితమైంది. 
 
ఈ రెండు జట్లకు కేవలం ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో పాకిస్థాన్, శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడాల్సి వుంది. ఒకవేళ ఇంగ్లండ్‌పై పాక్ గెలిచి, శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతే పాకిస్థాను సెమీస్ అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాకాకుండా తమ చివరి మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం సాధిస్తే నెట్ రన్‌రేట్ ఆధారంగా ఎవరు సెమీస్ చేరతారనేది తేలనుంది.
 
మరోవైపు, సెమీ ఫైనల్ అవకాశాలు మెండుగా ఉన్న జట్లలో ఆఫ్ఘనిస్థాన్ కూడా ఉంది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. తన చివరి రెండు మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లను ఆఫ్ఘనిస్థాన్ ఢీకొట్టబోతోంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే నాకౌట‌కు చేరుకోవడం ఖాయం. 
 
అయితే ఒకే మ్యాచ్ గెలిస్తే సమీకరణం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ ఖాతాల్లో కూడా 10 పాయింట్లు ఉంటే అగ్రస్థానంలో ఎవరు ఉంటారనేది నెట్ రన్ రేటు ఆధారంగా తేల్చనున్నారు. ఇక వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌పై విజయంతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో, 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈడెన్ గార్డెన్‌లో కోహ్లీ పుట్టిన రోజు వేడుకలు రద్దు