వెస్టిండీస్ క్రికెట్ జట్టు తృటిలో ఓ అద్భుతాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు డాషింగ్ ఆటగాడు క్రిస్ గేల్ వీరవిహారం చేసినప్పటికీ ఆ అద్భుతానికి కేవలం 29 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంతకీ ఆ ఆద్భుతం ఏంటనే కదా మీ సందేహం.. అయితే, ఈ కథనాన్ని చదవండి.
ప్రస్తుతం ఇంగ్లండ్ - వెస్టిండీస్ జట్ల వన్డే సిరీస్ జరుగుతోంది. ఇందులోభాగంగా నాలుగో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 418 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ బట్లర్ కేవలం 77 బంతుల్లో 150 రన్స్ చేయగా, మోర్గన్ 108, హేల్స్ 82 రన్స్ చేశారు. బట్లర్ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 13 ఫోర్లు ఉన్నాయి.
ఆ తర్వాత 419 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు... తృటిలో అద్భుత విజయాన్ని చేజార్చుకున్నది. 419 పరుగుల లక్ష్యం ఛేదనలో భాగంగా కేవలం 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ 162 రన్స్ చేశాడు. భారీ షాట్లతో అలరించిన గేల్ ఇన్నింగ్స్‌లో.. మొత్తం 14 సిక్సర్లు ఉన్నాయి.
గేల్ ఔటన తర్వాత కూడా కార్లోస్ బ్రెత్‌వెయిట్, నర్స్‌లు విజృంభించారు. కానీ 48వ ఓవర్‌లోనే సీన్ మారింది. చివరి 18 బంతుల్లో విండీస్‌కు 32 రన్స్ చేయాల్సింది. కానీ అదిల్ రషీద్ వేసిన ఆ ఒక్క ఓవర్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా విండీస్ జట్టు 389 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చరిత్రాత్మక విజయాన్ని అందుకునే అవకాశాన్ని విండీస్ మిస్సయ్యింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.