వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత ఛాంపియన్స్ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, టోర్నీ ఆరంభంలోనే పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత ఆటగాళ్లు పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా ఆడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పుడు మ్యాచ్ రద్దయ్యింది.
మరోవైపు పాకిస్తాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా జట్టు బలమైన ఆటగాళ్లతో ఉన్నా కేవలం 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ జట్టు కేవలం 8 ఓవర్లలో మ్యాచ్ గెలవడం పట్ల అనేక అనుమానాలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత ఛాంపియన్స్ జట్టు పాక్‌తో భారత్ సెమీఫైనల్ ఆడుతుందా? లేదా మళ్లీ తప్పుకుంటుందా? అనేది తెలియాల్సి వుంది. ఒక వేళ తప్పుకుంటే పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కి వెళ్లిపోతుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగాల్సి ఉంది. ఇది జరిగితే గ్రూప్ స్టేజ్‌లో ఆడకుండా, సెమీ ఫైనల్‌లో ఆడినందుకు విమర్శలు ఎదురవుతాయి.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఆసియా కప్ 2025లో కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అక్కడ కూడా రెండు జట్లు ఎదురెదురుగా తలపడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి భారత క్రికెట్ బోర్డు, జట్టు యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై ఉంది. జూలై 31న సెమీఫైనల్ జరగాల్సి ఉన్నా, మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లెజెండ్స్ సెమీఫైనల్ పోరు నుండి టాప్ స్పాన్సర్లు వైదొలిగుతున్నారు.