Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిత్ సెంచరీ-ఆసీస్‌తో చివరి వన్డేలో భారత్ గెలుపు.. కోహ్లీ ఖాతాలో రికార్డ్

రోహిత్ సెంచరీ-ఆసీస్‌తో చివరి వన్డేలో భారత్ గెలుపు.. కోహ్లీ ఖాతాలో రికార్డ్
, సోమవారం, 20 జనవరి 2020 (15:47 IST)
టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన రికార్డుల ఖాతాలో మరో మైలురాయిని చేర్చుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లతో 89) అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పేసర్ హజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో బోల్డ్ అయి 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 89 పరుగులు చేసే క్రమంలో కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

మిచెల్ స్టార్క్ వేసిన 23 ఓవర్ మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీ తరలించిన కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్‌గా 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తిచేసిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 
 
మూడో వన్డేలో 89 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారధిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉంది. ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో 11,207 పరుగులు చేసాడు. అయితే కోహ్లీ మాత్రం కేవలం 199 ఇన్నింగ్స్‌ల్లో 11,208 పరుగులు సాధించి ధోనీ రికార్డును అధిగమించాడు. 
 
లక్ష్య ఛేదనలో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7,000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ (133 ఇన్నింగ్స్‌ల్లో) మరో రికార్డు నెలకొల్పాడు. లక్ష్య చేధనలో ఏడు వేలు అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 232 ఇన్నింగ్స్‌ల్లో 8,720 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
 
అంతకుముందు.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (119, 128 బంతుల్లో ఆరు సిక్స్‌లు, 8 ఫోర్లు) శతకంతో అదరగొట్టాడు. కెప్టెన్‌ కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ (89 పరుగులు, 91 బంతుల్లో 8 ఫోర్లు)తో కదం తొక్కాడు. శ్రేయాస్‌ అయ్యార్‌ (44, 35 బంతుల్లో సిక్స్‌, ఆరు ఫోర్లు) మెరిశాడు. దీంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. 
 
ఆసీస్‌ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 47.3 ఓవర్లలో అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 21తో గెలుచుకుంది. ఆదివారం మూడో వన్డేలో ముందుగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 131 పరుగులు చేశాడు. వన్డేల్లో స్మిత్‌కు ఇది 9వ సెంచరీ కావడం విశేషం. 
 
భారత్‌పై మూడోసారి సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీసి సత్తా చాటగా.. జడేజాకు 2, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌కు చెరో ఒక వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌తో మహ్మద్‌ షమీ వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగూళూరు వన్డే : ఆస్ట్రేలియా బ్యాటింగ్ - భారత్‌కు అగ్నిపరీక్ష