హెటెక్ సమాజంలో యువతకు రీల్స్ మోజు ఎక్కువైంది. అనేక మంది రీల్స్ మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ఈ రీల్స్ తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. తాజాగా రీల్స్ వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడంపై తలెత్తిన వివాదం చివరకు ఒక తండ్రి తన కన్న కూతురినే తుపాకీతో కాల్చి చంపేంత దారుణానికి దారితీసింది. ఈ అత్యంత విషాదకర ఘటన గురుగ్రామ్‌లో గురువారం జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌లోని సెక్టార్-57, సుశాంత్ లోక్ ఫేజ్-2లో నివసిస్తున్న 25 ఏళ్ల రాధికా యాదవు ఆమె తండ్రే కాల్చి చంపాడు. రాధిక రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా పలు పోటీల్లో విజయం సాధించింది. అయితే, ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వ్యసనం ఉందని, ఈ విషయంలో తండ్రితో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి తన వద్ద ఉన్న తుపాకీతో రాధికపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తండ్రిని అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.