ఆసియా క్రికెట్ టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ స్పందిస్తూ, ఈ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న త్రివిధ సాయుధ దళాలకు అంకితమిస్తున్నట్టు చెప్పారు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 127 పరుగులు చేయగా, 128 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే తన సహచర బ్యాట్స్‌మెన్‌తో కలిసి నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, 'పహల్గాం ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళాలన్నింటికీ ఈ విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాము. మనందరికీ వారు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తునే ఉంటాం' అని సూర్యకుమార్ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ అదరగొట్టారు. 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 47 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.