ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్)లో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ వికెట్లను తీసి నేలకేసి కొట్టిన ఘటనపై అతడి భార్య ఉమ్మీ అల్ హసన్ స్పందించింది. మహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్, అబహానీ లిమిటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మొదట ఎల్బీకి అప్పీల్ చేసినా ఇవ్వకపోవడంతో స్టంప్స్‌ను షకీబ్ తన్నాడు. ఆ తర్వాత 5.5 ఓవర్ల వద్ద వర్షం రావడంతో అంపైర్ మ్యాచ్‌ను ఆపేశారు.
ఇంకో బంతి వేస్తే డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఫలితం తేల్చొచ్చని, ఆ బంతి వేసేందుకు అవకాశం ఉన్నా మ్యాచ్ ఆపేశారని కోపంతో ఊగిపోయిన షకీబ్ వికెట్లను తీసి ఎత్తేశాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తన భర్తపై కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. అతడిని విలన్ ను చేసి చూపిస్తున్నారని మండిపడింది. అంపైర్ల నిర్ణయాలపై తనకు అనుమానాలున్నాయంది. క్రికెట్ ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఫేస్‌బుక్‌లో ఆమె ఆ ఘటనకు సంబంధించి పోస్ట్ పెట్టింది.
ఈ ఘటనపై మీడియా ఎంత ఎంజాయ్ చేస్తోందో.. నేనూ అంతే ఎంజాయ్ చేస్తున్నా. అన్ని ఒడిదుడుకులకు ఎదురొడ్డిన వ్యక్తికి.. నిజానిజాలేంటో తెలిసిన కొందరైనా మద్దతుగా ఉన్నారు. అయితే, ఈ విషయంలో అతడిని అందరూ విలన్‌ను చేసి చూపిస్తున్నారు. అసలు నిజాన్ని సమాధి చేసేస్తున్నారు. ఇక్కడ అసలు సమస్య అంపైర్ల తప్పుడు నిర్ణయాలు. కావాలని కక్షపూరితంగానే తన భర్తను టార్గెట్ చేసుకున్నారు అని ఆమె పేర్కొంది.