గౌహతి వేదికగా పర్యటక సౌతాఫ్రికా, ఆతిథ్య భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట మంగళవారం కొనసాగుతుండగా, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. భారత దిగ్గ బౌలర్లు అనిల్ కుంబ్లే, ఆర్.అశ్విన్‌ల సరసన చేరాడు.
మంగళవారం ఉదయం టెస్ట్ మ్యాచ్ మొదటి సెషన్‌లో రవీంద్ర జడేజా సౌతాఫ్రికా ఓరనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్‌క్రమ్ (29)ను ఔట్ చేశాడు. దీంతో అతడు టెస్ట్ క్రికెట్‌లో సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
అతడికంటే ముందు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ రెడ్‌బాల్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం గౌహతిలో జరుగుతున్న టెస్ట్.. జడేజాకు దక్షిణాఫ్రికాతో 11వ మ్యాచ్. అతడు ఇప్పటివరకు 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసుకున్నాడు.
అయితే దక్షిణాఫ్రికా మీద ఎక్కువ వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా రికార్డ్ మాత్రం అనిల్ కుంబ్లే పేరు మీద ఉంది. అతడు 21 టెస్ట్ మ్యాచుల్లో 84 వికెట్లు తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే బుమ్రా సైతం 50 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 10 మ్యాచుల్లో 46 వికెట్లు సొంతం చేసుకున్నాడు.