స్వదేశంలో పర్యాటక దక్షిణాఫ్రికా జట్టుతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పైగా, ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకునేలా లేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా స్కోరుకు మరో 315 పరుగుల వెనుకంజలో ఉంది. ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే మరో 116 రన్స్ చేయాలి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(33*), కుల్‌దీప్ యాదవ్ (14 *) ఉన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 141 బంతుల్లో 52 పరుగులు జత చేశారు.
కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసింది. ఆ తర్వాత 9/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు భారత్ తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మొదట్లో చక్కగా ఆడుతున్నట్లే కనిపించిన టీమ్‌ఇండియా, టీ బ్రేక్‌కు ముందు చకచకా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరువాత కూడా పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ఒక దశలో 65/1తో పటిష్ఠ స్థితిలో ఉన్న భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయి 102/4తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (58; 97 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ కూడా అతడే కావడం గమనార్హం. కేఎల్ రాహుల్ (22; 63 బంతుల్లో, 2 ఫోర్లు) కుదురుకుంటున్న సమయంలో ఔట్‌గా వెనుదిరిగాడు. ధ్రువ్‌జురేల్ డకౌట్‌తో మరోసారి నిరాశ పరిచాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతడు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
కెప్టెన్ రిషభ్ పంత్ (7), సాయి సుదర్శన్ (15), నితీశ్‌కుమార్ రెడ్డి (10), రవీంద్ర జడేజా (6) తీవ్రంగా నిరాశ పరిచారు. పంత్ క్రీజులోకి వచ్చీ రాగానే సిక్స్‌తో ఖాతా తెరిచాడు. కానీ ఓవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయలేదు. అనవసరపు షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన మిగతా బ్యాటర్లు కూడా పంత్ బాటలోనే నడిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సన్ 4, సైమన్ ఆర్మర్ 2, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీసుకున్నారు.