Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సౌతాఫ్రికా బ్యాటర్ల వీరవిహారం - న్యూజిలాండ్ టార్గెట్ 358

south africa team
, బుధవారం, 1 నవంబరు 2023 (18:19 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా బుధవారం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 357 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. మొత్తం 116 బంతులు ఎదుర్కొన్న డికాక్ పది ఫోర్లు, మూడు సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. ఈ ప్రపంచ కప్‌లో డికాక్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. 
 
అలాగే, వాండర్ డసెన్ (133, 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. ఓపెనర్ తెంబా బావుమా (24) పరుగులు చేయగా.. ఆఖరులో డేవిడ్ మిల్లర్ (53, 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అర్థ శతకం సాధించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
 
ఇన్నింగ్స్ ఆరంభంలో డికాక్ నెమ్మదిగా ఆడగా.. బావుమా బౌండరీలు బాదాడు. తొమ్మిదో ఓవర్‌లో బావుమాను ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత వచ్చిన డసెన్‌తో జోడీకట్టిన డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ నిలకడగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో డికాక్ 103 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన డికాక్, డసెన్ జోడీని సౌథీ విడదీశాడు. అతడి బౌలింగ్ డికాక్.. ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే నీషమ్ బౌలింగ్ ఫోర్ బాది డసెన్ మూడంకెల స్కోరు (101 బంతుల్లో) అందుకున్నాడు. అనంతరం సౌథీ బౌలింగులో డసెన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న మిల్లర్ ధాటిగా ఆడాడు. నీషమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సిక్స్ బాది అర్థశతకం పూర్తి చేసుకున్న అతడు.. తర్వాతి బంతికే డారిల్ మిచెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. మొత్తం మీద సౌతాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 357 పరుగుల భారీ స్కోరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమర్శకుల నోళ్లు మూయించిన పాకిస్థాన్ జట్టు.. సెమీస్ ఆశలు సజీవం!!