Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : కొనసాగుతున్న సఫారీ జైత్రయాత్ర

south africa team
, బుధవారం, 25 అక్టోబరు 2023 (10:27 IST)
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సౌతాఫ్రికా జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. ప్రత్యర్థులపై భారీ స్కోర్లతో విరుచుకుపడుతూ ఘన విజయాలు నమోదు చేస్తుంది. మంగళవారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరడంతోపాటు రన్‌రేట్ కూడా మరింత మెరుగైంది. ఫలితంగా వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
 
ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లను ఆడిన సౌతాఫ్రికా నాలుగింటిలో గెలుపొందింది. దీంతో 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ఇక న్యూజిలాండ్ కూడా 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించినప్పటికీ రన్ రేటు తక్కువగా ఉండటంతో మూడో స్థానానికి దిగజారింది. ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్.. అన్నింటిలో గెలుపొంది మొత్తం పది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, 5, 6 స్థానాల్లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.
 
కాగా మంగళవారం వాంఖడే స్టేడియంలో బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్ చెలరేగి ఆడారు. బంగ్లా బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. డికాక్ 174, క్లాసెన్ 90 పరుగులతో రాణించడంతో 50 ఓవర్లలో 382 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 233 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా 111 పరుగులతో రాణించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 
 
క్వింటన్ డికాక్ ఊరమాస్ బాదుడు.. వెనక్కి తగ్గిన కోహ్లీ - రోహిత్  
 
భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో మొత్తం పది జట్లు పాల్గొనగా, వాటిలో ఒకటి సౌతాఫ్రికా. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఊరమాస్ బాదుడుకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. తన వీరబాదుడుతో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యిలా మారారు. ఫలితంగా సౌతాఫ్రికా విజయాల్లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన డికాక్ మూడు సెంచరీలు చేశాడు. దీన్నిబట్టే అతను ఏ స్థాయి ఫామ్‌లో ఉన్నాడో ఇట్టే గ్రహించవచ్చు. 
 
ముఖ్యంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మరింత విధ్వంసం సృష్టించాడు. 140 బంతులు ఎదుర్కొని 174 పరుగులు సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుత వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అనూహ్య మార్పులు జరిగిపోయాయి. 
 
మంగళవారం వరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో కింగ్ విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్ తొలి రెండు స్థానాల్లో ఉండేవారు. కానీ బంగ్లాపై 174 పరుగులు సాధించడంతో డికాక్ ఏకంగా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. మొత్తం 407 పరుగులతో డికాక్ అగ్రస్థానంలో ఉండగా 354 పరుగులతో రెండో స్థానంలో కోహ్లీ, 311 పరుగులతో రోహిత్, 302 పరుగులతో రిజ్వాన్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
 
డికాక్ బంగ్లాదేశ్‌పై 174 పరుగులు, శ్రీలంకపై 100, ఆస్ట్రేలియాపై 109 చొప్పున పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు క్వింటన్ డికాక్‌ను వెనక్కి నెట్టే బ్యాటర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లి మరో 53 పరుగుల దూరంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌లో కోహ్లీ రాణిస్తే మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లడం ఖాయం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్వింటన్ డికాక్ ఊరమాస్ బాదుడు.. వెనక్కి తగ్గిన కోహ్లీ - రోహిత్