హర్యానా హరికేన్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సరసన భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్ చేరారు. తద్వారా 39 యేళ్లనాటి రికార్డును సమం చేశారు. క్రికెట్ మక్కాగా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లండ్‌లో లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఈ అరుదైన రికార్డును సిరాజ్ నెలకొల్పారు.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ సంచలన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు చొప్పున మొత్తం 8 వికెట్లు తీశారు. మొత్తం 126 పరుగులు ఇచ్చాడు.
39 యేళ్ళ క్రితం కపిల్ దేవ్ ఇదేవిధంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీసి 168 పరుగులు ఇచ్చాడు. అలాగే, 2007లో ఆర్పీ సింగ్ ఏడు వికెట్లు తీసి 117 పరుగులు ఇచ్చాడు. 1996లో వెంకటేష్ ప్రసాద్ ఏడు వికెట్లు తీసి 130 రన్స్ ఇచ్చాడు. 2014లో ఇషాంత్ శర్మ ఏడు వికెట్లు 135 పరుగులు ఇచ్చాడు.