లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. వర్షం కురిసి, మబ్బులు పట్టిన వాతావరణంలోనూ జిమ్మీ అండర్సన్, మార్క్‌వుడ్, ఒలీ రాబిన్సన్ బౌలింగ్‌ను ఉతికారేసింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.
ముఖ్యంగా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (127*; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) తొలి వికెట్‌కు 126 పరుగులు జోడించారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వాతావరణంలో 44 ఓవర్ల వరకు తొలి వికెట్ ఇవ్వకపోవడం గమనార్హం.
మొదట రోహిత్ శర్మ తనదైన రీతిలో ఆడాడు. సొగసైన షాట్లతో అలరించాడు. థర్డ్‌మ్యాన్ దిశగా అతడు బాదిన బౌండరీలు అద్భుతమనే చెప్పాలి. అతడు ఔటయ్యాక ఇంగ్లాండ్‌కు రాహుల్ చుక్కలు చూపించాడు. తనదైన స్ట్రోక్‌ప్లేతో మురిపించాడు.
చూడచక్కని కట్‌షాట్లు, బ్యాక్‌ఫుట్ పంచ్‌లతో బౌండరీలు బాదేశాడు. నిలదొక్కుకొనేంత వరకు నెమ్మదిగా ఆడాడు. తొలి 100 బంతుల్లో 18 పరుగులు చేసిన అతడు అర్ధశతకానికి మరో 37 బంతులే తీసుకున్నాడు. ఆపై మరో 75 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు. విరాట్ కోహ్లీ (42; 103 బంతుల్లో 3×4) సైతం రాణించాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు రాహుల్-రోహిత్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(83) ఔట్ కాగా.. పుజారా(9) నిరాశపరిచాడు. నిలకడగా ఆడుతున్న కెప్టెన్ కోహ్లి(42) చివర్లో ఔటయ్యాడు. ఆండర్సన్‌కు రెండు, రాబిన్సన్‌కు ఒక వికెట్ దక్కాయి.