Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లార్డ్స్ టెస్ట్ : రాహుల్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

లార్డ్స్ టెస్ట్ : రాహుల్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (08:14 IST)
ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. జట్టు బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి సెంచరీ నమోదు చేశారు. దీంతో భారత్ 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి పటిష్టస్థితిలో వుంది. 
 
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. లార్డ్స్‌లో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం 1952 తర్వాత ఇదే తొలిసారి. 
 
గతంలో వినూ మన్కడ్ - పంకజ్ రాయ్ ఈ ఘనత సాధించారు. అలాగే, టెస్టుల్లో రోహిత్ - రాహుల్ తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించడం ఇది రెండోసారి.
 
తొలుత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన రోహిత్ ఆ తర్వాత జోరు పెంచాడు. వరుస ఫోర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో 145 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 83 పరుగులు చేసిన రోహిత్.. సెంచరీ ముంగిట జేమ్స్ అండర్సన్ బౌలింగులో బౌల్డయ్యాడు. 
 
మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో భారత జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. చటేశ్వర్ పుజారా మరోమారు తీవ్రంగా నిరాశపరచగా, కెప్టెన్ కోహ్లీ 42 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగులో వెనుదిరిగాడు.
 
అర్థ సెంచరీ పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్న రాహుల్ ఆ తర్వాత సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. తొలి వంద బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ ఆ తర్వాత 37 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 
 
అనంతరం మరో 75 బంతుల్లోనే సెంచరీ నమోదు చేయడం గమనార్హం. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. రాహుల్ (127), రహానే (1) క్రీజులో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాక్సర్ ల‌వ్లీనాకు డీఎస్పీ పోస్టు ఆఫర్