ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్ నియమితుల్యయారు. సౌతాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్ క్రమ్‌కు జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. ఇటీవలవరకు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కెప్టెన్‌గా ఉన్న మార్ క్రమ్ ఉన్న విషయం తెల్సిందే. అతని సారథ్యంలో ఆ జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యాటర్‌కు ఇపుడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ పగ్గాలు అప్పగించారు.
గతంలో తమకు ఐపీఎల్ ట్రోఫీని అందించిన డేవిడ్ వార్నర్‌తో పాటు చాన్నాళ్లు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ జట్టు వదులుకున్న విషయం తెల్సిందే. పైగా, ఈ సీజన్ వేలం పాటల్లో భువనేశ్వర్, మార్ క్రమ్‌లను రిటైన్ చేసుకోవడంతో పాటు పంజాబ్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది.
దీంతో మయాంక్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, హైదరాబాద్ జట్టు యాజమాన్యం మాత్రం మరోమారు విదేశీ ఆటగాడికే కెప్టెన్సీ పగ్గాలు అందించింది. కాగా, ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.