Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెస్టిండీస్‌తో ఆట... ఆసీస్‌తో వేట... ఇదీ విరాట్ కోహ్లీ గేమ్ ప్లాన్

వెస్టిండీస్‌తో ఆట... ఆసీస్‌తో వేట... ఇదీ విరాట్ కోహ్లీ గేమ్ ప్లాన్
, బుధవారం, 10 అక్టోబరు 2018 (16:02 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ప్రస్తుతం స్వదేశంలో పర్యాటక వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతోంది. ఇందులో తొలి టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నిగ్స్ ఆధిక్యంతో విజయభేరీ మోగించింది. ఇక మిగిలిన రెండో టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగనుంది.
 
అయితే, వెస్టిండీస్‌ను స్వదేశంలో టెస్ట్ సిరీస్‌కు ఆహ్వానించడం వెనుక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు ఉద్దేశ్యం వేరేగా ఉంది. స్వదేశంలో విండీస్‌తో ఆటాడి.. ఆస్ట్రేలియా పర్యటనలో గెలుపు వేట మొదలెట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసమే యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించారు. 
 
ఈ ఇద్దరు కొత్త ముఖాలు ఓపెనర్లే కావడం గమనార్హం. వీరిలో ఒకరు పృథ్వీ షా. మరొకరు మయాంక్ అగర్వాల్. రాజ్‌కోట్‌లో పృథ్వీ షాకు అవకాశం చిక్కింది. అతడు అరంగేట్రంలోనే అదరగొట్టే శతకంతో అందరికీ ఆకట్టుకున్నాడు. 99 బంతుల్లోనే 100 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 
 
ఇకపోతే, విండీస్‌తో సిరీస్‌లో మరో టెస్టు మాత్రమే మిగిలింది. చివరి టెస్టు శుక్రవారం నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. కంగారు పర్యటనకు ముందు మయాంక్‌కు ఓ అవకాశం ఇవ్వటం తప్పనిసరి. అందుకున్న ఏకైక అవకాశం హైదరాబాదే. దీంతో ఉప్పల్‌ టెస్టులో ముగ్గురు ఓపెనర్లూ తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తోంది.
 
ముగ్గురు ఓపెనర్లలో కెఎల్‌ రాహుల్‌ మాత్రమే పూర్తిగా పరీక్షించారు. మయాంక్‌ అగర్వాల్‌ కోసం పృథ్వీ షాను పక్కన పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్క టెస్టు ఇన్నింగ్స్‌తో ఈ కుర్రాడిపై భారత్‌ భరోసా పెట్టలేదు. అందుకే అతడికి వరుసగా అవకాశాలు కల్పించాల్సివుంది. 
 
అదేసమయంలో మయాంక్‌కు అవకాశం ఇవ్వటం కోసం కెఎల్‌ రాహుల్‌ను బెంచ్‌కు పరిమితం చేసే పరిస్థితి లేదు. అలాగని అజింక్యా రహానె, చతేశ్వర్‌ పుజారాలలో ఒక్కరికి విశ్రాంతి ఇవ్వలేదు. సుదీర్ఘ సిరీస్‌ నేపథ్యంలో అవసరమైతే కెప్టెన్‌ కోహ్లీయే విశ్రాంతి తీసుకుని తుది జట్టులో మయాంక్‌ అగర్వాల్‌కు మార్గం సుగమం చేయవచ్చనే క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
గత దేశవాళీ సీజన్‌లో నిలకడగా 1000 ప్లస్‌ పరుగులు సాధించిన మయాంక్‌ అగర్వాల్‌, ఈ సీజన్‌లోనూ సత్తా చాటాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు మయాంక్‌ అగర్వాల్‌కు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని కెప్టెన్‌, కోచ్‌ ఓ నిర్ణయానికి రావటంతో హైదరాబాద్‌ టెస్టులో అగర్వాల్‌ అరంగేట్రం ఖాయంగా తెలుస్తోంది. తొలి టెస్టు మాదిరిగానే ఓ రోజు ముందుగానే 12 మంది జట్టును ప్రకటించనున్నారు. దీంతో అగర్వాల్‌ అరంగేట్రంపై గురువారమే స్పష్టత రానున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్టిగా వుంటే పోయేదేముంది.. విరాట్ కోహ్లీపై విమర్శలు