స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం అసలుసిసలైన పోరు జరుగనుంది. ఆతిథ్య భారత్‌కు పర్యాటక జట్టు న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. సాధారణ మ్యాచ్ అయితే క్రికెట్ అభిమానులు ఈ పోటీని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో గెలుపొందింది. అలాగే, కివీస్ కూడా అదే విధంగా ఉంది. దీంతో పాయింట్ల పరంగా ఈ రెండు జట్లూ సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీనికితోడు అన్ని రంగాల్లో ఇరు జట్లూ సమ ఉజ్జీవులుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ మ్యాచ్‌పై అమితాసక్తి నెలకొంది.
ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతున్న ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే రసవత్తరమైన పోరుకు ధర్మశాల స్టేడియం వేదికకానుంది. 2019 టోర్నీ సెమీస్‌లో భారత్ టైటిల్ ఆశలకు బ్రేక్ వేసింది కూడా న్యూజిలాండ్ జట్టేనన్న విషయం అభిమానులు భావిస్తున్నారు. 240 పరుగుల ఛేదనలో ధోనీ సేన 18 రన్స్ తేడాతో ఓడింది. ఇప్పుడు ఆ బాధాకర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఓవరాల్‌గా వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌పై కివీస్‌దే పైచేయిగా నిలిచింది. ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. కివీస్ 1987లో రెండుసార్లు, 2003లో మాత్రమే ఓడి 5-3తో ఆధిక్యలో ఉంది. ఓ మ్యాచ్ రద్దయ్యింది.
మరోవైపు గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో ఎవరికి చోటు కల్పిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హార్దిక్ వంటి మరో ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడంతో మ్యాచ్ ఫినిషర్‌కు చోటు కల్పించాలన్న ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉంది. ఈ కోవలోకి సూర్యకుమార్ యాదవ్, పేసర్ షమి రేసులో ఉన్నారు. షమి పేస్, స్వింగ్ ఇక్కడి పిచ్‌పై బ్యాటర్లను ఇబ్బందిపెడుతుంది. ఒకవేళ ఇద్దరినీ తీసుకోవాలనుకుంటే అంతగా రాణించలేకపోతున్న శార్దూల్‌ను పక్కనబెట్టవచ్చు. టాపార్డర్ గిల్, రోహిత్, విరాట్ ఫామ్ భీకరంగా ఉంది. శ్రేయాస్, రాహుల్ ఆ తర్వాత స్థానాల్లో సిద్ధంగా ఉంటారు. ఇక సూర్యకుమార్, జడేజా కుడి ఎడమ కాంబినేషన్‌లో ఫినిషర్లుగా ఉపయోగపడతారు. పేసర్లు బుమ్రా, సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇప్పటికే నిరూపించుకున్నారు.
ఇంకోవైపు, కివీజట్టును పరిశీలిస్తే, గాయంతో బాధపడుతున్న కెప్టెన్ విలియమ్సన్ గైర్హాజరీలోనూ కివీస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతోంది. కాన్వే, రచిన్, మిచెల్, యంగ్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. అటు స్పిన్నర్ శాంట్నర్ 11 వికెట్లతో టాపర్ కొనసాగుతున్నాడు. పేస్ త్రయం బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ ఎలాంటి బ్యాటింగ్ లైనప్‌నైనా భయపెట్టగలదు.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అంచనా..
భారత్ : రోహిత్ (కెప్టెన్), గిల్, విరాట్, శ్రేయాస్, రాహుల్, సూర్య కుమార్/ఇషాన్, జడేజా, కుల్దీప్, షమి/ శార్దూల్, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్ : కాన్వే, యంగ్, రన్, మిచెల్, లాథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, చాప్ మన్, శాంట్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్.