క్రికెట్ ప్రపంచంలో డేవిడ్ వార్నర్ తెలియనివారు వుండరు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో వార్నర్ చాలా చాలా పాపులర్. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా అలా రాగానే ఇలా బన్నీ పాటలకు స్టెప్పులు వేసి ఇన్ స్టాగ్రాంలో పెట్టేస్తుంటాడు. ఇప్పుడు అదే డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా పాకిస్తాన్ బౌలర్లతో ఆట ఆడుకున్నాడు. బంతులు వేయాలంటే పాక్ బౌలర్లు గజగజ వణికిపోయే స్థితికి తెచ్చాడు.
దొరికిన బంతిని దొరికినట్లు ఒకవైపు వార్నర్-మరోవైపు మార్ష్ చితక్కొట్టారు. వీరిరువురి ధాటికి ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 367 పరుగులు చేసింది. వార్నర్ 14x4, 9x6లతో చెలరేగి ఆడి 163 పరుగులు చేసాడు. మార్ష్ 10x4, 9x6లతో 121 పరుగులు చేసాడు. గ్లెన్ మాక్స్ డకౌటయ్యాడు. స్మిత్ 7 పరుగులు, స్టోనిస్ 21 పరుగులు, మార్నస్ 8 పరుగులు, మిట్చెల్లి స్టార్క్ 2 పరుగులు, జోష్ డకౌట్ అయ్యారు. కమిన్స్ 6 పరుగులు, జంపా 1 పరుగుతో నాటవుట్‌గా నిలిచారు. వాస్తవానికి వార్నర్ జోరును మిగిలిన మిడిలార్డర్ బ్యాట్సమన్లు చేసి వుంటే ఆస్ట్రేలియా పరుగులు 400 దాటి వుండేవే. కానీ చివర్లో పాక్ బౌలర్లకు తలొగ్గి వికెట్లు పారేసుకున్నారు.
పాకిస్తాన్ జట్టు 368 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఆస్ట్రేలియా జట్టుకు ధీటుగా పాక్ ఓపెనర్లు ఆడుతున్నారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్తాన్ జట్టు స్కోరు 111. అబ్దుల్లా 51 నాటవుట్, ఇమాముల్ హక్ 53 నాటవుట్ క్రీజులో వున్నారు. చూస్తుంటే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించే ఊపులోనే కనబడుతున్నారు. చూడాలి మరి. క్రికెట్ ఆట అంతా పేకమేడ టైపే కదా.