జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్- బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. మంగళవారం ఉదయం 8.15 గంటలకు అర్నియా సెక్టార్‌లోని విక్రమ్ పోస్ట్‌పై పాకిస్థాన్ రేంజర్లు కాల్పులు జరిపారు.
ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు బుల్లెట్లు తగిలిందని, వారికి వెంటనే వైద్యసహాయం అందించామని బీఎస్ఎఫ్ ప్రకటన తెలిపింది. కాల్పుల ఘటనను పాక్ రేంజర్లతో ప్రస్తావించి వారిపై ఫిర్యాదు చేస్తామని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
కాల్పులు ప్రారంభం కాగానే సరిహద్దు పోస్ట్ సమీపంలో విద్యుత్ పనులు చేస్తున్న ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లపై పాక్ బలగాలు కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 25, 2021న, భారతదేశం- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కాల్పుల విరమణపై అన్ని ఒప్పందాలను ఖచ్చితంగా పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.