టీమిండియా ఆస్ట్రేలియాపై గెలుపును నమోదు చేసుకుంది. గెలిచి తన లెక్కను సరిచేసుకుంది. భారత బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా రాణించటంతో కంగారూలపై కోహ్లీసేన విజయభేరి మోగించింది. తొలి వన్డేలో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది.
రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు ఉపక్రమించిన ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (98), లబుషేన్ (46) పోరాడినా ఫలితం దక్కలేదు.
రెండు వికెట్లు సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ను మలుపుతిప్పగా, షమీ (3), సైనీ (2), జడేజా (2) సమయోచితంగా రాణించి జట్టు విజయంలో పాలుపంచుకున్నారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జనవరి 19 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడారు.
స్మిత్, లబుషేన్‌లు క్రీజులో ఉన్నంత సేపూ వికెట్ల కోసం చెమటోడ్చిన భారత బౌలర్లు ఆ తర్వాత విజృంభించారు. 38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. జోరుమీదున్న స్మిత్ (98)ను సెంచరీ ముంగిట బౌల్డ్ చేసి ఆసీస్‌కు భారీ ఝలకిచ్చాడు.
ఆ తర్వాత 44వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనూ రెండు వికెట్లు తీసిన షమీ.. ఆసీస్ విజయావకాశాలను దెబ్బతీసి భారత్‌కు విజయాన్ని చేరువ చేశాడు. ఇక నవదీప్ సైనీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత విజయాన్ని ఖాయం చేసాడు. ఇక చివరి ఓవర్లో బుమ్రా జంపాను ఔట్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు.. జడేజా, కుల్దీప్,సైనీలు తలా 2 వికెట్లు తీశారు.