Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్స్‌కు టీమిండియా నిరాకరణ... భారత జట్టుపై చర్యలు

Advertiesment
india vs pak

ఠాగూర్

, మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (09:55 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా, గత ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, పాకిస్తాన్‌పై గెలిచిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత జట్టు ఆటగాళ్ళు నిరాకరించారు. ఇదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. షేక్ హ్యాండ్స్ చేసేందుకు నిరాకరించిన భారత ఆటగాళ్ళపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం, సాంప్రదాయబద్ధంగా పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే మైదానం వీడింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, మ్యాచ్ అనంతరం జరిగే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించాడు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అధికారికంగా ఫిర్యాదు చేసింది. భారత జట్టుపై ఏసీసీ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తెస్తోంది.
 
ఈ వివాదంపై మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, తాము ప్రభుత్వ, బీసీసీఐ సూచనల మేరకే నడుచుకున్నామని స్పష్టం చేశాడు. 'మేము భారత ప్రభుత్వం, బీసీసీఐ సూచనలకు కట్టుబడి ఉన్నాం' అని పేర్కొన్నాడు. ఇరు దేశాల మధ్య ఇటీవలికాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. మే నెలలో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఇదే మొదటి క్రికెట్ మ్యాచ్ కావడం గమనార్హం. 
 
అంతేకాకుండా భారత ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని తమ కెప్టె‌న్‌కు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించారని కూడా పీసీబీ తమ ఫిర్యాదులో ఆరోపించింది. టోర్నీ నుంచి అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా, బుధవారం యూఏఈతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే.. వచ్చే ఆదివారం సూపర్ ఫోర్ దశలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సాయుధ దళాలకు ఈ విజయం అంకితం : సూర్యకుమార్