మహిళల ప్రపంచ కప్ గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా భారత్ ఓడిపోయింది. దీనిపై భారత మహిళా స్టార్ క్రికెట్ స్మృతి మంథాన స్పందించారు. మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిపోవడానికి తానే కారణమని, ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనవసరమైన షాట్ ఆడి ఔట్ కావడం వల్లే జట్టు ఓటమి పాలైందని అంగీకరించింది.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 289 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ ఒక దశలో పటిష్ట స్థితిలో నిలిచింది. స్మృతి మంధాన (88), హర్మన్ ప్రీత్ కౌర్ మూడో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, కీలక సమయంలో మంధాన అనవసర షాట్‌కు ప్రయత్నించి స్పిన్నర్ లిన్సే స్మిత్ బౌలింగ్ అవుటైంది. ఆ తర్వాత భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. చివరి 52 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో వికెట్లు కోల్పోయి 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
మ్యాచ్ అనంతరం మంథాన మాట్లాడుతూ, 'మేం కుప్పకూలిపోయామన్నది నిజం. ఆ దశలో మా షాట్ సెలక్షన్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. ముఖ్యంగా అది నాతోనే మొదలైంది కాబట్టి, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. నా షాట్ సెలక్షన్ ఇంకా తెలివిగా ఉండాల్సింది. ఓవరకు ఆరు పరుగులే అవసరమైనప్పుడు, మేం మ్యాచ్‌లో మరింత లోతుకు తీసుకెళ్లాల్సింది. కాబట్టి, ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. క్రికెట్లో ఏదీ సులభంగా రాదు. ఈ ఓటమిని మేం ఒక పాఠంగా తీసుకుంటాం. తర్వాతి మ్యాచ్ మాకు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది' అని ఆమె పేర్కొన్నారు.