Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లార్డ్స్ టెస్టులో తడబడిన భారత్ - భారమంతా రిషభ్ పంత్‌పైనే

Advertiesment
లార్డ్స్ టెస్టులో తడబడిన భారత్ - భారమంతా రిషభ్ పంత్‌పైనే
, సోమవారం, 16 ఆగస్టు 2021 (11:38 IST)
లార్డ్సే వేదికగా ఆతిథ్యం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు పూర్తిగా తడబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్లు కెఎల్, రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటుగా ఆల్‌రౌండర్ జడేజా కూడా ఘోరంగా విఫలమైనారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 
 
అంటే ఇంగ్లాండ్‌పై 154 పరుగుల ఆధిక్యత మాత్రమే ఉంది. మ్యాచ్‌ను రక్షించుకోవాలంటే చివరి రోజు మరిన్ని పరుగులు జోడించడంతో పాటుగా వీలైనంత ఎక్కువ సమయం బ్యాట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఉన్నది టెయిలెండర్లే కావడంతో భారమంతా రిషబ్ పంత్‌పైనే ఉంది. 
 
మరోవైపు, నాలుగో రోజున వెలుతురు లేని కారణంగా మరో 8 ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు ఆటను నిలిపి వేశారు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలు బాధ్యతాయుతంగా ఆడి నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించడంతో టీమిండియా కొంతవరకు కోలుకుంది.
 
నాలుగో రోజు తొలి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికే కేవలం 56 పరుగులకే ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (5), రోహిత్ శర్మ(21)తో పాటుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. 
 
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె, పుజారాలపై జట్టును ఆదుకునే భారమంతా పడింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అంతగా రాణించని ఈ ఇద్దరూ మొదట్లో అనవసరమైన షాట్లకు వెళ్లకుండా ఆచితూచి ఆడుతూ వికెట్లను కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో టీ విరామ సమయానికి స్కోరు 105 పరుగులకు చేరింది.
 
అయితే ఆ తర్వాత క్రీజ్‌లో కుదురుకున్న ఈ ఇద్దరూ కాస్త స్వేచ్ఛగా బ్యాట్ చేస్తూ రావడంతో స్కోరు వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే రహానే తన అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చాలా రోజుల తర్వాత రహానే అర్ధ సెంచరీ చేయడం గమనార్హం. ఇది అతనికి టెస్టుల్లో 24వ అర్ధ సెంచరీ. అయితే అంతా సజావుగా సాగిపోతున్న తరుణంలో 45 పరుగులు చేసిన పుజారా అవుటవడంతో ఇంగ్లాండ్ జట్టులో మళ్లీ ఆశలు చిగురించాయి. అప్పటికి స్కోరు 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే. 
 
ఆ తర్వాత కొద్ది సేపటికే రహానే కూడా అవుట్ కావడంతో భారత్ 167 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బట్లర్ క్యాచ్ పట్టడంతో రహానే అవుటయ్యాడు. అప్పటికి జట్టు ఆధిక్యత 140 పరుగులే.141 బంతులు ఎదుర్కొన్న రహానే 5 బౌండరీలతో 61 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత రిషబ్ పంత్‌తో జత చేరిన జడేజా కేవలం మూడు పరుగులకే మొయిన్ అలీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆట ముగిసే వేళకు పంత్ 14 పరుగులతో, ఇశాంత్ శర్మ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టగా, మొయిన్ అలీకి 2, శామ్ కరన్‌కు ఒక వికెట్ లభించాయి. కాగా ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లి సెంచరీలకు రెండేళ్లు.. 99.99, 99.97 పర్సంటేజ్ మార్కులు..?