ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కరోనా వచ్చినా.. క్రికెట్ ఆగినా.. టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌తో మాంచెస్టర్ వేదికగా మంగళవారం ముగిసిన ఆఖరి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ టీమ్.. మూడు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకోవడం ద్వారా ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నెం.3 స్థానానికి ఎగబాకింది.
పట్టికలో భారత్ 360 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (296), ఇంగ్లాండ్ (226), న్యూజిలాండ్ (180), పాకిస్థాన్ (140) టాప్-5లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా.. అప్పటి వరకూ ర్యాంక్‌ల్లో మార్పులు ఉండవు.
2019, ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ఐసీసీ ప్రారంభించగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంత గడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి.