Publish Date: Mon, 29 Apr 2019 (19:08 IST)
Updated Date: Mon, 29 Apr 2019 (19:09 IST)
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీనా జహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షమీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్ట్ చేశారు. హసీన్ జహాన్ షమీ ఇంట్లో గొడవకు దిగిందనే కారణంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది కిందట షమీ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అలాగే తనను చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి విదితమే. దీంతో కోల్‌కతా పోలీసులు షమీపై ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈక్రమంలో దంపతుల మధ్య గొడవ కాస్త సద్దుమణిగింది. కానీ వాళ్లిద్దరు మాత్రం కలిసి ఉండటం లేదు. కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సహాస్‌పూర్ అలీనగర్ గ్రామంలో ఉన్న షమీ ఇంటికి వెళ్లిన హసీన్ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది. హాసీన్ తమ ఇంట్లో ఉండటం ఇష్టం లేని షమీ కుటుంబసభ్యులు ఆమెను పట్టించుకోవడం మానేశారు. దాంతో హసీన్ అత్తింటి వాళ్లతో గొడవకు దిగింది. ఇంటిలో నుంచి వెళ్లిపోవాల్సిందిగా వారు చెప్పడంతో హసీన్ కూతురితో సహా తనను తాను ఓ గదిలో బంధించుకుంది.
ఇక షమీ కుటుంబసభ్యులు చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్నపోలీసులు హసీన్ జహాన్‌ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై హసీన్ వాదన మాత్రం ఇలా ఉంది. ‘నేను నా భర్త ఇంటికి వచ్చాను. ఇక్కడ ఉండేందుకు నాకు సర్వహక్కులు ఉన్నాయి. కానీ మా అత్తింటివాళ్లు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు’ అని అంటోంది.
మోహన్ మొగరాల
Publish Date: Mon, 29 Apr 2019 (19:08 IST)
Updated Date: Mon, 29 Apr 2019 (19:09 IST)