ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి ఎవరూ ఊహించని స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు, బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ 14వ సీజన్ పోటీలూ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ దెబ్బకు అనేక మృత్యువాతపడుతున్నారు. దేశంలో భయానక వాతావరణం నెలకొనివుంది. దీంతో ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు తమతమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇపుడు తమను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్ విమానం ఏర్పాటు చేయాలని ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ లీన్.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరాడు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఐపీఎల్ టోర్నీపైనా పడింది. ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. వీరిలో ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో టోర్నీ ముగిసిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లు సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రిస్ లీన్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు.
'ఏటా ఐపీఎల్ ఒప్పందంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా 10 శాతం మొత్తాన్ని చార్టర్డ్ విమానం కోసం ఖర్చు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరాను. ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని తెలుసు. అయితే మేము కఠిన నియమ నిబంధనలు కలిగిన బబుల్‌లో ఉన్నాం. వచ్చే వారం వ్యాక్సిన్ కూడా తీసుకుంటాం. ప్రభుత్వం ప్రత్యేక విమానంలో మమ్మల్ని స్వదేశానికి అనుమతిస్తుందని అనుకుంటున్నాం అని క్రిస్ లీన్ అభిప్రాయపడ్డాడు.
భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో లీన్ ఇలా అభ్యర్థించడం గమనార్హం. మరోవైపు, ఐపీఎల్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లు స్వదేశానికి రావడానికి సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.
వారంతా అక్కడకు ప్రైవేట్‌గా వెళ్లారు. ఇదేమీ ఆస్ట్రేలియన్ టూర్ కాదు. వాళ్లకు సొంత వనరులు ఉన్నాయి. వారు వాటిని ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకుని వారంతా ఆస్ట్రేలియాకు వస్తారని భావిస్తున్నా అని మోరిసన్ ప్రకటించడం విశేషం.