గతంలో రాసలీలల బాగోతంతో బయటపడిన నిత్యానంద స్వామి మళ్లీ వార్తల్లో నిలిచాడు. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించారు. ద్వీపదేశం కైలాస పేరిట ఓ ఈ-మెయిల్ ఐడీ కూడా సృష్టించారు. నిత్యానంద కైలాస దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా దేశం నుంచి కైలాస దీవికి గరుడ పేరిట ఛార్టర్ విమాన సర్వీసులను నిత్యానంద ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. కైలాస దీవిలో ఎవరికైనా వసతి కల్పిస్తారని, అయితే కేవలం మూడు రోజులకు మించి ఉండటానికి అనుమతించరని సమాచారం.
దీవిని సందర్శించేవారు పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తారు. కైలాస డాట్ ఆర్గ్ పేరిట అధికారిక వెబ్ సైట్ సైతం ప్రారంభించారని సమాచారం. ఆగస్టు నెలలో నిత్యానంద రిజర్వుబ్యాంకు ప్రారంభించిన వీడియోను విడుదల చేశారు. కైలాస దీవిలో ఇంగ్లీషు, సంస్కృతం, తమిళభాషలను అధికారిక భాషలుగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీవారి గెటప్‌లో నిత్యానంద కనిపించాడు.
నిత్యానంద అప్పుడప్పుడు తాను కృష్ణ పరమాత్ముని అవతారంగా చెప్పుకుంటాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి గెటప్‌లో కనిపించి ఆ ఫోటోను నెట్టింట వైరల్ చేశాడు. ఇందుకు నిత్యానంద సమాధి దర్శనం అంటూ ట్యాగ్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.