తెలుగు క్రికెటర్లలో అంబటి రాయుడు ఒకరు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కానీ, జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయారు. నిలకడలేమి ఫామ్‌తో జట్టు దూరమవుతూ వచ్చారు. పైపెచ్చు.. క్రికెట్‌లో అతనికంటూ గాడ్‌ఫాదర్లు లేకపోవడం కూడా అంబటి రాయుడు కెరీర్‌ను దెబ్బతీసింది. దీంతో ఆయన క్రికెట్‌కు దూరమయ్యారు. ఇపుడు రాజకీయ నాయకుడిగా అవతారమెత్తనున్నారు. అంబటి రాయుడు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై రెండు రోజుల క్రితం రాయుడు ఓ రీట్వీట్ చేశారు. దీంతో ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం గత బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని వైసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా, దాన్ని అంబటి రాయుడు రీట్వీట్ చేశారు. "మన ముఖ్యమంత్రి జగన్ గారి గొప్ప ప్రసంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్" అని కామెంట్స్ చేశారు. దీంతో అంబటి రాయుడు వైకాపాలో చేరుతున్నారనే ప్రచారం విస్తృతంగాసాగింది.
కాగా, తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు రాయుడు ఇంతకుముందే ప్రకటించాడు. రాయుడిని భారత రాష్ట్ర సమితిలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. అదేసమయంలో రాయుడు వైకాపాలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరవొచ్చని తొలుత భావించారు. మరో పత్రిక మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు రాసింది. ఇపుడు వైకాపాలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.