వచ్చే ఎన్నికల్లో వైకాపాకే ఓటు వేస్తారనే నమ్మకం ఉండి.. వారు మనకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుడి చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి అని ఏపీ రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాద రావు సూచించారు. ఈ మేరకు వలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు. శ్రీకాకుళం టౌన్‌హాల్లో సోమవారం రాత్రి వలంటీర్లతో సమావేశం జరిగింది. ఇందులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు నాలుగు పద్దతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి, ఏలో వైకాపాకు వేసేవారిని, బీలో వైకాపాకు ఓటు వేయని వారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించారు. తెదేపాకు ఓటు వేసే ఒక్క కుటుంబాన్ని వైకాపా వైపు వలంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై కొట్టాలి. దూర ప్రాంతాలకు వెళ్లిపోయిన వైకాపా ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలి. ఎవరైనా మాట వినకపోతే కుటుంబ పెద్దలను కలిసి మాట్లాడాలి. కొందరు కుల పెద్దల మాట వింటారు. అలాంటి వారిని గుర్తించి కుల పెద్దలతో మాట్లాడాలి. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలి. మాకంటే వలంటీర్లకో ఓటర్లలో మంచిపేరుంది. వైకాపా ఓడిపోతే వలంటీర్ ఉద్యోగం పోతుంది అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.