ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం పింక్ బంతిని ఉపయోగిస్తున్నారు. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 244 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
తొలి రోజైన గురువారం 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసిన టీమిండియా రెండో రోజు మరో 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. అశ్విన్ (15) పరుగులకు ఔట్ కాగా, సాహా(9), ఉమేష్(6), షమీ(0) ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్ క్యూ కట్టారు. బుమ్రా 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్స్‌లో స్టార్స్ 4, కమిన్స్ 3 వికెట్స్ తీసారు. హాజిల్ వుడ్, లియాన్‌కు చెరో వికెట్ దక్కాయి.
భారత్ ఇన్నింగ్ ఓ దశలో స్ట్రాంగ్‌గా కనిపించిన కోహ్లీ ఔట్ కావడంతో లైనప్ పేకమేడలా కుప్పకూలింది. తొలి రోజు కోహ్లీ, రహానే రాణించడంతో ఓ దశలో 3 వికెట్లకు 188 పరుగుల వద్ద పటిష్టంగా నిలిచిన భారత్ 206కే ఆరు వికెట్లకు చేరింది. రహానే తప్పిదం కారణంగా కోహ్లీ రనౌటవడంతో మ్యాచ్ దశ తిరిగిపోయింది.
భారత బ్యాట్స్‌మెన్లు చేసిన పరుగులు పరిశీలిస్తే, ఓపెనర్లలో పృథ్వీషా ఈ టెస్ట్ మ్యాచ్ రెండో బంతికే డకౌట్ కాగా, మయాంక్ అగర్వాల్ 17, పుజారా 43, కోహ్లీ 74, రహాన్ 42, హనుమ విహారి 16, వృద్ధిమాన్ షా 9, అశ్విన్ 15, యాదవ్ 6, బుమ్రా 4 చొప్పున పరుగులు చేశారు.