ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం ఇంగ్లండ్ చేతిలో భారత్ అవమానకరరీతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల వైఫల్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. భారత క్రికెట్ సగటు అభిమానులే కాదు విదేశీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం ఓ ఓటమిని, ఆటగాళ్ల ఆటతీరును వెనుకేసుకొచ్చాడు.
ఈ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ, "నాణేనికి రెండు ముఖాలు ఉంటాయి. జీవితం కూడా అంతే మన జట్టు విజయాన్ని మనదిగా జరుపుకుంటున్నపుడు మన జట్టు ఓటములను కూడా అదే మాదిరిగా తీసుకోవాలి. జీవితంలో ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి" అని వ్యాఖ్యానించారు.
భారత్ జట్టు ఘోర ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ తదితర ఆటగాళ్లను తప్పించాలంటూ అభిమానుల డిమాండ్లు, విమర్శలు కురుస్తుండటం తెల్సిందే. మాజీ క్రికెట్ సునీల్ గవాస్కర్ సైతం భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించవద్దని, పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు అందుకోవచ్చని జోస్యం చెప్పారు.