Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాఫ్రికాతో 4th T20I: 82 పరుగుల తేడాతో భారత్ గెలుపు

Team India
, శనివారం, 18 జూన్ 2022 (11:47 IST)
Team India
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా అనూహ్యంగా పుంజుకుంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఓటమితో ఇక సిరీస్ చేజార్చుకుందనుకున్న సమయంలో తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి సఫారీలపై వరుస విజయాలు నమోదు చేసింది. 
 
శుక్రవారం (జూన్ 17) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన శుభారంభం లభించలేదు. టాప్-4 బ్యాట్స్‌మెన్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (4), ఇషాన్ కిషన్ (27), శ్రేయాస్ అయ్యర్ (4), రిషబ్ పంత్ (17) పరుగులు మాత్రమే చేశారు. 
 
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కేలా చేశారు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్ 9 ఫోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా మహారాజ్, ప్రెటోరియస్, మార్కో జాన్సెన్, నోర్ట్జే తలో వికెట్ తీశారు. 
 
టీమిండియా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. డస్సెన్ చేసిన 20 పరుగులే ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చాహల్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.
 
ఈ మ్యాచ్‌లో గెలుపుతో సిరీస్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉన్నాయి. టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 ఆదివారం (జూన్ 19) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా జాతీయ రికార్డు